|

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: ధర్మపథంలో భాగంగా నిత్య కళారాధన కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు

ధర్మపథంలో భాగంగా నిత్య కళారాధన కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా) ఈరోజు (25.06.2022) మాతృశ్రీ అచ్చమాంబ భజన బృందం, గుంటూరు భజన కార్యక్రమం నిర్వహించబడింది.

ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ భజన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.

ఈ కార్యక్రమములో పలు భక్తి గీతాలు, అష్టకాలు మొదలైన వాటిని టి. అచ్చిరెడ్డి, ఎ. కృష్ణారెడ్డి, ఎం. వెంకయ్య, సి.హెచ్. శ్రీనివాసరావు, రామానాథం, కె. నాగశ్రీ, టి. సునీత, పి. కోటేశ్వరరావు, శివలీల, బి. కృష్ణకుమారి తదితరులు భజన కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాగా శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ ధర్మపథం కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.

రేపటి సాంస్కృతిక కార్యక్రమాలు

రేపు (26.06.2022) శ్రీ వేద గాయత్రీ నృత్య కళాక్షత్రం, విశాఖపట్నం వారిచే సంప్రదాయ నృత్యం కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.

ఆలయ ప్రాంగణంలోని అభివృద్ధి పనుల పరిశీలన

ఈ రోజు కార్యనిర్వహణాధికారివారు ఆలయ ప్రాంగణములో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు.

సర్పదోష నివారణ పూజా మండపములో ప్రస్తుతము గ్రానెట్ బండపరుపు వేయబడుతోంది. ఈ బండపరుపు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం సర్పదోష నివారణ పూజా మండపం చుట్టూ ఎస్ ఎస్ గ్రిల్ ( స్టెయిన్ లెస్ గ్రిల్) ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు.

నాగులకట్ట ప్రదేశం కుడిభాగంలో ఉండే గోడపొడవునా ( సాలుమండపాల వెనుక వైపు గోడ) దేవతా మూర్తుల చిత్రాలను చిత్రీకరించేందుకు చర్యలు చేపట్టాలని కూడా ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా స్వామివారి యాగశాల వద్ద ఉన్న అన్నపూర్ణాదేవి ఆలయ పరిసరాలలో కూడా గ్రానైట్ బండపరుపు వేయాలని ఆదేశించారు.

ఈ పరిశీలనలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఎం. నరసింహరెడ్డి, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. హరిదాసు, సహాయ స్థపతి ఐ.యు.వి. జవహర్ తదితరులు పాల్గొన్నారు.

నందినికేతన్ అతిథిగృహం పరిశీలన

ఈ రోజు  ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీరెడ్డివారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి శ్రీ ఎస్. లవన్న పలువురు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి నందినికేతన్ అతిథిగృహాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నందినికేతన్ అతిథిగృహాన్ని ఆధునీకరించేందుకు పలు ఆదేశాలు జారీ చేశారు. నందినికేతన్ అతిథిగృహంలోనూ, అతిథిగృహం ప్రాంగణములోనూ అవసరమైన మరమ్మతులు వెంటనే ప్రారంభించాలన్నారు.

అదేవిధంగా నందినికేతన్ అతిథిగృహంలో అవసరమైనచోట్ల ఫాలసీలింగ్ వేయించాలన్నారు.

అలాగే అవసరమైనచోట్ల వాల్ క్లాడింగ్ ( గోడలకు వాల్ పేపరు అతికించు ప్రక్రియ) చేయాలని ఆదేశించారు.

ముఖ్యంగా నందినికేతన్ అతిథిగృహంలో ఎలక్ట్రిక్ వైరింగ్ కూడా మరమ్మతులు చేపట్టాలన్నారు. ఇంకా అవసరమైన ఫర్నీచరును కూడా ఏర్పాటు చేయాలన్నారు.

నందినికేతన్ ప్రాంగణములో గల ప్రస్తుత షెడ్డుకు గల ప్లాస్టిక్ షీట్ తొలగించి పాలికార్బన్ షీటును అమర్చాలని ఆదేశించారు.

ఇంకా నందినికేతన్ ప్రాంగణములో పచ్చదనాన్ని పెంపొందించేవిధంగా మరికొన్ని మొక్కలను నాటాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమములో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు పి.మురళీబాలకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంచార్జి ( ఐసి) శ్రీనివాసరెడ్డి, అసిస్టెంట్ ఇంజనీరు సీతారమేష్ తదితరులు పాల్గొన్నారు.

దేవస్థాన ఒప్పంద ఉద్యోగినికి ఆర్ధిక సహాయం 

శ్రీశైల దేవస్థానంనందు లడ్డు ప్రసాద విభాగములో పొరుగుసేవల విధానంలో విధులు నిర్వహిస్తున్న శ్రీ యం. మల్లికార్జుననాయక్ అనారోగ్య కారణంగా 18.04.2022న మరణించారు.

వారి కుటుంబానికి ఆర్థిక సాయంగా ఈ రోజు (25.06.2022) శ్రీశైల దేవస్థానం నందు పనిచేయుచున్న ఒప్పంద మరియు పొరుగుసేవల సిబ్బంది వారి నెలవారీ జీతం నుండి ఒక రోజు వేతనం మొత్తాన్ని రూ.1,58,952/-లు డిమాండ్ డ్రాఫ్టుల రూపములో అందేజేశారు. అదేవిధంగా రూ. 9,200/-ల నగదును కూడా వీరు అందజేయడం జరిగింది.

ఈ మేరకు సంబంధిత డిమాండ్ డ్రాఫ్ట్ ను మరియు నగదును మరణించిన ఉద్యోగి భార్య శ్రీమతి యం. భ్రమరాంబాబాయికి కార్యనిర్వహణాధికారి వారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది.

బహిరంగ వేలము డిపాజిట్టుగా డిమాండ్ డ్రాఫ్టులతో పాటు నగదు కూడా స్వీకరణ

ఈ నెల 27వ తేదీన ఉదయం గం.11.00ల నుండి చంద్రవతి కల్యాణ మండపం నందు శ్రీలలితాంబికా షాపింగ్ కాంప్లెక్స్ నందలి 109 దుకాణములను 3 సంవత్సరాల కాలపరిమితితో లీజు హక్కు కేటాయింపు చేయుటకు బహిరంగ వేలము నిర్వహించబడుతున్నది.

ఈ బహిరంగవేలమునకు డిపాజిట్లుగా రూ.1,00,000/- డిమాండ్ డ్రాఫ్టు ద్వారా చెల్లింపు చేయవలసినదిగా బహిరంగవేలము ప్రకటనలో తెలియజేయడం జరిగింది.

కాగా ఈ రోజు ( 25.06.2022) శనివారం మరియు రేపు ( 26.06.2022) ఆదివారం బ్యాంకు సెలవుల కారణంగా బహిరంగవేలములో పాల్గొనువారికి అసౌకర్యము కలగకుండా ఉండుటకుగాను నగదును కూడా డిపాజిట్లుగా స్వీకరించడం జరుగుతున్నది. బహిరంగవేలములో పాల్గొనదలచినవారు డిపాజిట్లు మొత్తమును డిమాండు డ్రాఫ్టుగా లేదా నగదుగా చెల్లించి బహిరంగవేలములో పాల్గొనవచ్చు.

కావున డిమాండు డ్రాఫ్టును పొందనివారు నగదుగా రూ. 1,00,000/-ను చెల్లించి బహిరంగవేలములో పాల్గొనే అవకాశం కూడా కల్పించబడినది.

ఇప్పటికే ఈ విషయాన్ని దేవస్థాన ప్రసారవ్యవస్థ ద్వారా (మైకు ద్వారా) తెలియజేయడం జరుగుతున్నది. కావున ఈ విషయము గమనించవలసినదిగా తెలియజేయడమైనది.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *