శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: దత్తాత్రేయస్వామివారికి విశేష పూజలు
దత్తాత్రేయస్వామివారికి విశేష పూజలు
శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు (30.06.2022) ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం క్రింద నెలకొని ఉన్న శ్రీ దత్తాత్రేయస్వామివారికి విశేష పూజలను నిర్వహించింది.
ప్రతి గురువారం దేవస్థానసేవగా (సర్కారీసేవగా) ఈ కైంకర్యం జరిపించబడుతోంది. ఈ పూజా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతిపూజను జరిపించబడింది. ఆ తరువాత దత్తాత్రేయస్వామివారికి పంచామృతాభిషేకం, విశేష పూజలు నిర్వహించబడ్డాయి.
లోకోద్ధరణకోసమై బ్రహ్మ, విష్ణు,మహేశ్వరులు ఒకే స్వరూపములో దత్తాత్రేయునిగా అవతరించారు. అందుకే త్రిమూర్తి స్వరూపునిగా దత్తాత్రేయుడు ప్రసిద్ధుడు. కాగా శ్రీశైలక్షేత్రానికి దత్తాత్రేయుల వారికి ఎంతో దగ్గర సంబంధం ఉంది. ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం క్రింద దత్తాత్రేయులవారు తపస్సు చేశారని ప్రతీతి. అందుకే ఈ వృక్షానికి దత్తాత్రేయ వృక్షమని పేరు. కాగా దత్తాత్రేయస్వామివారు కలియుగంలో గోదావరితీరాన పిఠాపురంలో శ్రీపాదవల్లభునిగా జన్మించారు. వీరు ఒకసారి శ్రీశైలక్షేత్రంలోనే చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించినట్లుగా గురుచరిత్రలో చెప్పబడింది.
కాగా శ్రీపాదవల్లభుడు తమ శిష్యులకు ఆయా తీర్థక్షేత్రాల మహిమావిశేషాలను పేర్కొనే సందర్భంలో శ్రీపాదవల్లభుల జన్మ తరువాత మహారాష్ట్రలోని కరంజినగరములో నృసింహసరస్వతి స్వామిగా దత్తాత్రేయస్వామివారు జన్మించారు.వీరు ఒకసారి మహాశివరాత్రి రోజున శ్రీశైలమల్లికార్జునుని సేవించినట్లుగా కూడా గురుచరిత్ర చెబుతోంది. ఈ నృసింహసరస్వతి వారు తమ అవతార సమాప్తిని శ్రీశైలంలోని పాతాళగంగలోనే చేశారు.
కలియుగ ప్రభావం రోజు రోజుకు ఎక్కువకావడముతో, నృసింహసరస్వతీస్వామి అదృశ్యరూపములో ఉండి తన భక్తులను రక్షించాలని నిర్ణయించారు. దాంతో భౌతికదేహాన్ని త్యజించేందుకు నలుగురు శిష్యులతో కలిసి శ్రీశైలానికి వచ్చారు. శ్రీశైలంలోని కదళీవనం దగ్గర తమ శిష్యులు చూస్తుండగానే నృసింహసరస్వతిస్వామివారు అరటి ఆకులతో చేసిన ఒక ఆసనంపై కూర్చోని, కృష్ణానదిలో ప్రవేశించి, కొంతదూరం ఆ అరటి ఆకులపైనే పయనిస్తూ, అదృశ్యమైనట్లు గురుచరిత్ర చెబుతోంది.
సాంస్కృతిక కార్యక్రమాలు
దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా) ఈ రోజు ఎం.ఎస్.వి. మ్యూజిక్ అకాడమీ, హైదరాబాద్ వారిచే గాత్ర కచేరి కార్యక్రమం నిర్వహించింది.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ గాత్ర కచ్చేరి కార్యక్రమం ఏర్పాటు చేసారు.
ఈ గాత్ర కార్యక్రమములో సాంబశివ, శివతాండవస్తోత్రం, లింగాష్టకం, ఈశాగిరీశా, బోళాశంకర తదితర ఠ తదితర కీర్తనలను ఆలాపించారు.
ఈ కార్యక్రమములో శ్రీవాణి, రమ్య, హిమజ, శిరిష, భవ్యకృతి, శారదా తదితరులు గాత్రాన్ని అందించారు. ఈ ఈ కార్యక్రమానికి వీణ సహకారాన్ని శారద, ఫ్లూట్ సహకారాన్ని వరలక్ష్మి కీ బోర్డు సహకారాన్ని సత్యదేవ్ అందించారు.
కాగా శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ ధర్మపథం కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.