|

శ్రీశైల దేవస్థానం: యోగా తో శారీరక, మానసిక, ఆధ్యాత్మికంగా ఎన్నో మంచి ఫలితాలు

యోగా తో శారీరక, మానసిక, ఆధ్యాత్మికంగా ఎన్నో మంచి ఫలితాలు

శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం  మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించింది.ఆలయ దక్షిణమాడ వీధిలో వేదిక వద్ద ఈ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసారు.దేవస్థానం సిబ్బందితో పాటు పలువురు యాత్రికులు కూడా ఈ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఉదయం 7 గంటల నుండి గం. 8.30 వరకు జరిగింది. ముందుగా ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి అసిస్టెంట్ కమిషనర్  హెచ్.జి. వెంకటేష్, పలువురు అధికారులు, అర్చక స్వాములు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీశైల జగద్గురు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చెన్నసిద్దరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామివారు విచ్చేసి అనుగ్రహ భాషణం చేశారు.

పీఠాధిపతులు ప్రసంగిస్తూ విజ్ఞానానికి నిలయమైన మన భారతదేశంలో ఎన్నో వేల సంవత్సరాల నుండి అభివృద్ధి చెందిన పలు శాస్త్రాలలో యోగాశాస్త్రం కూడా ఒకటని అన్నారు. వాస్తవానికి యోగా అనేది మన సంస్కృతిలో అనాదిగా ఆచరణలో ఉన్నప్పటికీ పతంజలి మహర్షి దానిని సూత్రబద్ధం చేసి యోగా సాధన మార్గాన్ని సుగమం చేశాడన్నారు.యోగసాధనకు పతంజలి మహర్షి ఎనిమిది అంచలు ఏర్పరచాడని, దానిని అష్టాంగయోగగా పేర్కొంటున్నామన్నారు. యమం, నియమం. ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణం, ధ్యానం, సమాధి అనే ఎనిమిది అంచలే అష్టాంగ యోగమని ప్రసిద్ధమయ్యాయని అన్నారు. పతంజలి మహర్షి “యోగ: చిత్తవృతి నిరోధ:” అని యోగాను నిర్వచించాడని, ఇక్కడ “చిత్తము” అనేదానికి “మనస్సు” అనే అర్థాన్ని స్వీకరించాలన్నారు. కాబట్టి మనస్సు వలన జరిగే వృత్తులను అంటే మనసు యొక్క విధులను నిగ్రహించగలగడమే యోగా అని పేర్కొన్నారు. మనిషి తన శరీరాన్ని సాధనంగా చేసుకుని మనస్సును మార్గంగా చేసుకుని చేసే అద్భుతమైన ఆధ్యాత్మికయాత్రగా ఈ యోగాను పేర్కొనవచ్చన్నారు.యోగా అంటే కలయిక, కూర్పు, కూడిక, విధానం అనే అర్థాలు ఉన్నాయని చెబుతూ యోగసాధన అనేది ఆత్మ – పరమాత్మల అనుసంధానానికి దోహదం చేస్తుందన్నారు.

 ప్రముఖ యోగా శిక్షకులు బాలుజీ యోగాచార్య, ఒంగోలు , ఆయా అంశాలను వివరిస్తూ అందరిచేత యోగాసనాలు చేయించారు.ప్రతి ఆసనానికి కూడా  వివరణ ఇస్తూ, యోగాపరమైన అంశాలను అధునిక వైద్య విజ్ఞానంతో అనుసంధానం చేస్తూ ఆయా విశేషాలను, యోగా వల్ల కలిగే ప్రయోజనాలను పేర్కొన్నారు. శారీరక ఆసనాలు, శ్వాసపై ధ్యాస, ధ్యానం, ప్రాణాయామం, ముద్రలు మొదలైనవన్నీ యోగాలోని ప్రధాన క్రియలు అని చెప్పారు. ఆరోగ్యకరమైన జీవితం, సుఖసంతోషాలు, బాధల నుండి విముక్తి, మానసిక ప్రశాంతత మొదలైనవన్నీ కూడా యోగా సాధన ద్వారా పొందవచ్చునని అన్నారు.యోగా వలన శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎన్నో మంచి ఫలితాలు లభిస్తాయన్నారు.వీరు తాడాసనము, వృక్షాసనము, వక్రాసనము, ఉత్తాన పాదాసనము, పవనముక్తాసనము, అర్ధహలాసనము, శలభాసనము, పాదహస్తానము, దండాసనము మొదలైన ఆసనాలను చేయించారు.

ఆసనాలు తరువాత సూక్ష్మవ్యాయమం చేయించారు. సూక్ష్మవ్యాయమం తరువాత ప్రాణాయామం చేసారు. కపాలభాతి, అనులోమ విలోమ, శీతలి, భ్రామరి మొదలైన విధానాలతో ప్రాణాయామం కొనసాగింది.ప్రాణాయామం తరువాత ధ్యానం, చివరగా శాంతిమంత్రాలతో ఈ యోగా కార్యక్రమం ముగిసింది. చివరిలో దేవస్థానం అర్చకులు, అధికారులు గురువందన కార్యక్రమాన్ని నిర్వహించి జగద్గుర పీఠాధిపతివారికి వస్త్ర సమర్పణ చేశారు. యోగ శిక్షకులందరికీ దేవస్థానం తరుపున శేషవస్త్రం, ప్రసాదాలను అందజేసి, వారిని సత్కరించారు. 

కార్యక్రమం లో యోగాచార్య బాలుజీతోపాటు సహాయ యోగా శిక్షకులు ఎస్. సుబ్బారావు, ఎం. జగదీష్, బోయపాటి రవి, ఎ.వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. దేవస్థానం సహాయ కమిషనర్  హెచ్.వెంకటేష్ తో పాటు శ్రీశైలప్రభ సంపాదకులు డా. సి.అనిల్ కుమార్, పర్యవేక్షకులు ఎన్ శ్రీహరి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ( ఐ/సి) శ్రీనివాసరెడ్డి, ముఖ్యభద్రతా అధికారి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *