|

శ్రీశైల దేవస్థానం: సాక్షి గణపతి స్వామికి విశేష అభిషేకం

శ్రీ సాక్షిగణపతిస్వామికి విశేష అభిషేకం

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: లోక కల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు (29.06.2022) ఉదయం సాక్షిగణపతిస్వామి వారికి విశేష అభిషేకాన్ని నిర్వహించింది.

కాగా ప్రతి బుధవారం, సంకటహరచవితిరోజులు మరియు పౌర్ణమిరోజులలో శ్రీసాక్షిగణపతి వారికి ఈ విశేష అభిషేకం మరియు పూజాదికాలు దేవస్థానంసేవగా (సర్కారిసేవగా) నిర్వహించబడుతున్నాయి.

ఈ ఉదయం సాక్షిగణపతిస్వామివారికి పంచామృతాలతోనూ, పలుఫలోదకాలతోనూ, హరిద్రోదకం, గంధోదకం, పుష్పోదకం, కలశోదకం, శుద్ధజలంతో అభిషేకం నిర్వహించబడింది. తరువాత స్వామివారికి విశేష పుష్పార్చన, నివేదన కార్యక్రమాలు జరిపించబడ్డాయి.

వైదిక సంప్రదాయాలలో గణపతి అభిషేకానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఈ గణపతి అభిషేకం వలన అనుకున్న పనులలో ఆటంకాలు తొలగి విజయం లభిస్తుందని చెప్పబడుతోంది. అలాగే కోరిన కోరికలు నెరవేరుతాయని, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలుగుతాయని, ముఖ్యంగా విద్యార్థులలో ఆలోచనా శక్తి పెరిగి విద్య బాగా వస్తుందని చెప్పబడుతోంది.

కాగా శ్రీశైలక్షేత్ర పరివార ఆలయాలలో సాక్షిగణపతి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది.
భక్తులు శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించినట్లుగా కైలాసంలో పరమేశ్వరుని వద్ద ఈ స్వామి సాక్ష్యం చెబుతాడని ప్రసిద్ధి. అందుకే ఈ స్వామి సాక్షిగణపతిగా పేరొందాడు. చక్కని నల్లరాతితో మలచబడిన ఈ స్వామి ఒక చేతిలో కలం, మరో చేతిలో పుస్తకాన్ని ధరించి భక్తుల పేర్లను నమోదు చేస్తున్నట్లుగా దర్శనమిస్తాడు.

ఆలయప్రాంగణములోని వీరభద్రస్వామికి విశేష పూజలు

లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు సాయంకాలం ఆలయ ప్రాంగణం లోని వీరభద్రస్వామివారికి (జ్వాలా వీరభద్ర స్వామివారికి) విశేషపూజలను నిర్వహించారు.

ఆలయప్రాంగణంలో మల్లికార్జునస్వామివారి ఆలయానికి ఉత్తరభాగంలో మల్లికాగుండానికి ప్రక్కనే ఉన్న వీరభద్రస్వామి జ్వాలామకుటంతో పదిచేతులతో విశిష్టరూపంలో దర్శనమిస్తాడు. శిల్పశాస్త్ర పరిభాషలో ఈ స్వామికి అఘోరవీరభద్రమూర్తి అని పేరు కూడా ఉంది. స్వామివారికి ప్రక్కనే దక్షప్రజాపతి కనిపిస్తాడు. ఈ స్వామిని పరివార ఆలయాలలో భాగంగా ప్రతినిత్యం పూజించడం జరుగుతోంది.

కాగా ప్రతి బుధవారం ప్రదోషకాలంలో విశేష అభిషేకం కార్యక్రమం దేవస్థానం నిర్వహిస్తోంది.
ఈ పూజవలన లోకశాంతి, దుర్భిక్షనివారణ, భక్తుల అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా క్షేత్ర అభివృద్ధి జరుగుతుంది.

కాగా ఈ పూజలలో ముందుగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజను నిర్వహించారు.

తరువాత వీరభద్రస్వామికి పంచామృతాలతోనూ, పలురకాల ఫలోదకాలతోనూ, గంధోదకం, భస్మోదకం, పుష్పోదకం, బిల్వోదకం, హరిద్రోదకంతోనూ మరియు మల్లికా గుండంలోని శుద్ధజలంతో విశేష అభిషేకం నిర్వహించడం జరిగింది.

ఈ అభిషేకాల తరువాత విశేషంగా స్వామివారికి పుష్పార్చనను జరిపించబడింది.

సాంస్కృతిక కార్యక్రమాలు 

దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా) ఈరోజు శ్రీ సాయి నృత్య కళాశాల, నందికొట్కూరు వారిచే ఈ సంప్రదాయ నృత్య కార్యక్రమం ఏర్పాటు చేసారు.

ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య, కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.

ఈ కార్యక్రమములో మూషికవాహన, కైలాసంలో సాంబశివుడు, శివాష్టకం, బ్రహ్మాంజలి తదితర గీతాలకు టి. లోహిత, అక్షర తదితరులు నృత్య ప్రదర్శన చేసారు.

కాగా శ్రీ స్వామి అమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ ధర్మపథం కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.

రేపటి సాంస్కృతిక కార్యక్రమాలు

రేపు (30.06.2022) శ్రీ ఎం.ఎస్.వి.మ్యూజిక్ అకాడమి, హైదరాబాద్ వారిచే భక్తి సంగీత విభావరి కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *