శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: పరోక్షసేవగా బయలు వీరభద్రస్వామివారి విశేషపూజ
శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి విశేష అభిషేకం
శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: లోక కల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు (28.06.2022) ఉదయం ఆలయప్రాంగణంలోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేష పూజలను నిర్వహించడం జరిగింది.
ప్రతి మంగళవారం మరియు కృత్తికా నక్షత్రం, షష్ఠి తిథి రోజులలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి ఈ విశేష అభిషేకం మరియు పూజాదికాలు దేవస్థానం సేవగా (సర్కారి సేవగా) నిర్వహించబడుతున్నాయి.
కుమారస్వామివారికి పూజలు జరపడం వలన లోకకల్యాణమే కాకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగి ఆయా పనులు సక్రమంగా జరుగుతాయి. సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహంతో శత్రుబాధలు, గ్రహపీడలు, దృష్టి దోషాలు మొదలైనవి తొలగిపోతాయి. అలాగే సంతానం కోసం పూజించేవారికి తప్పక సంతానభాగ్యం లభిస్తుందని చెప్పబడుతోంది.
ఈ అభిషేకానికి ముందుగా దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని,
జనులకు ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాలమరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, జనులందరూ సుఖశాంతులతో ఉండాలంటూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు.
తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజ జరిపించబడింది. అనంతరం శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి అభిషేకము, అర్చన తరువాత సుబ్రహ్మణ్యస్తోత్రము పారాయణలు చేయబడ్డాయి.
సుబ్రహ్మణ్యస్వామి అభిషేకంలో స్వామివారికి పంచామృతాలైన పాలు, పెరుగు,తేనె,నెయ్యి, కొబ్బరినీళ్లు మరియు వివిధ పండ్ల రసాలైన దానిమ్మ, కమలా, ద్రాక్ష, అరటి మొదలైన వాటితో అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా వివిధ పళ్ల రసాలతో చేసే అభిషేకంతో ఎంతో ఫలితం ఉంటుందని ఆగమాలు చెబుతున్నాయి.
పరోక్షసేవగా బయలు వీరభద్రస్వామివారి విశేషపూజ
ఈ రోజు అమావాస్య సందర్భంగా శ్రీశైల క్షేత్రపాలకుడైన శ్రీబయలు వీరభద్రస్వామి వారికి విశేషార్చన జరిపించబడింది.
ప్రతీ మంగళవారం, అమావాస్యరోజులలో ఈ విశేషార్చనను జరిపించడం జరుగుతోంది.
కాగా అమావాస్య రోజున భక్తులు కూడా పరోక్షసేవగా ఈ అర్చనను జరిపించుకునే అవకాశం కల్పించబడింది.
ఈనాటి విశేషపూజలలో మొత్తం 42 మంది భక్తులు పరోక్షసేవను నిర్వహించుకుంటున్నారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుండి కూడా భక్తులు ఈ పరోక్షసేవలో పాల్గొంటున్నారు. ఈ
కాగా ఈ పూజాదికాల కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతి పూజను జరిపించబడింది.
ఈ పూజాదికాలలో పంచామృతాలతోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో వీరభద్రస్వామివారికి అభిషేకం నిర్వహించారు.
ఈ స్వామి ఆరాధన వలన గ్రహదోషాలు నివారించబడుతాయని, అరిష్టాలన్నీ తొలగి పోతాయని, ఎంతటి క్లిష్ట సమస్యలైనా పరిష్కరించబడతాయని, ప్రమాదాలు నివారించ బడతాయని, సర్వకార్యానుకూలత లభిస్తుందని, అభీష్టాలు సిద్ధిస్తాయని పండితులు పేర్కొంటున్నారు.
ఈ పరోక్షసేవకు భక్తులు ఆన్లైన్ ద్వారా రూ.1,116/-లను సేవారుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. భక్తులు సేవారుసుమును www.srisalladevasthanam.org లేదా aptemples. ap.gov.in ద్వారా చెల్లింపు చేయవచ్చు.
కాగా ఈ పరోక్షసేవ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించేందుకు వీలుగా ప్రసార వివరాలు, ప్రసారాల సమయం మొదలైనవాటిని ఎప్పటికప్పుడు సేవాకర్తలకు తెలియజేయడం జరుగుతున్నది.
సేవాకర్తలేకాకుండా భక్తులందరు కూడా వీటిని శ్రీశైలటి.వి / యూ ట్యూబ్ ద్వారా వీక్షించవచ్చును. కావున భక్తులందరు కూడా ఈ పరోక్షసేవను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము.
ఇతర వివరములకు దేవస్థానం సమాచార కేంద్ర ఫోన్ నంబర్లు 83339 01351 / 52/53/54/ 55/56 లను సంప్రదించవచ్చును.
నందీశ్వరస్వామికి విశేషపూజ
లోక కల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు ఆలయప్రాంగణంలోని నందీశ్వర స్వామికి (శనగల బసవన్న స్వామివారికి) విశేషార్చనలను నిర్వహించారు.
ప్రతి మంగళవారం మరియు త్రయోదశి రోజున దేవస్థాన సేవగా (సర్కారీ సేవగా) ఈ కైంకర్యం జరిపించబడుతోంది. ప్రదోషకాలంలో అనగా సాయంసంధ్యాసమయంలో ఈ విశేషపూజలు నిర్వహించడం జరుగుతోంది.
ఈ విశేషార్చనలో ముందుగా లోకక్షేమాన్ని కాంక్షిస్తూ దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరిత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని, జనులకు ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాలమరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, జనులందరూ సుఖశాంతులతో ఉండాలంటూ అర్చకస్వాములు, వేదపండితులు సంకల్పాన్ని చెప్పడం జరుగుతుంది.
అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజను జరిపించారు.
ఆ తరువాత నందీశ్వరస్వామికి శాస్తోక్తంగా పంచామృతాలతోనూ, ద్రాక్ష, బత్తాయి, అరటి మొదలైన ఫలోదకాలతో హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రాక్షోదకం, బిల్వోదకం, పుష్పోదకం, సువర్లోదకం మరియు మల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం నిర్వహిస్తారు. తరువాత నందీశ్వరస్వామికి అన్నాభిషేకం నిర్వహించారు.
పురుషసూక్తం, వృషభసూక్తం మొదలైన వేదమంత్రాలతో శాస్తోక్తంగా ఈ విశేషాభిషేకాన్ని చేయడం జరుగుతుంది. తరువాత నందీశ్వరస్వామివారికి నూతన వస్త్ర సమర్పణ, విశేష పుష్పార్చనలను చేసారు. అనంతరం నానబెట్టిన శనగలను నందీశ్వరస్వామికి సమర్పించడం జరిగింది.
చివరగా స్వామికి నివేదన సమర్పించారు.
స్వామివారికి వెండి నాగాభరణం
ఈ రోజు (28.06.2022) శ్రీ మల్లికార్జునస్వామివార్లకు వెండి నాగాభరణం సమర్పించబడింది.
దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ ఎస్. లవన్న గారి సతీమణి శ్రీమతి ఎన్. విజయ ఈ వెండి నాగాభరణాన్ని సమర్పించారు.
ఈ నాగాభరణం బరువు 3 కేజీల 266 గ్రాములు. ఈ వెండి నాగాభరణం విలువ రూ. 2,47, 305/- లు అని దాత తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముందుగా కృష్ణదేవరాయగోపురం వద్ద నాగభరణానికి ప్రత్యేక పూజలు నిర్వహించ బడ్డాయి.
అనంతరం నాగాభరణంతో ఆలయ ప్రదక్షిణ చేసిన అనంతరం కార్యనిర్వహణాధికారి మరియు వారి కుటుంబసభ్యులు నాగాభరణంతో ఆలయ ప్రదక్షిణ చేశారు.
తరువాత వెండి నాగాభరణానికి వృద్ధమల్లికార్జునస్వామివార్ల ఆలయ మండపంలో సంప్రోక్షణ పూజాదికాలు జరిపించబడ్డాయి.
కాగా గత ఫిబ్రవరి మాసములో వారి తనయుడు సహస్రలింగేశ్వరస్వామివారికి 6 కేజీల 770 గ్రాములతో తయారు చేయించిన వెండి నాగాభరణం సమర్పించడం జరిగింది.