శ్రీశైలంలో స్వామి అమ్మవార్లకు ఉయ్యాల సేవ
శ్రీశైలంలో స్వామి అమ్మవార్లకు ఉయ్యాల సేవ
శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు (01.07.2022) సాయంకాలం శ్రీస్వామిఅమ్మవార్లకు ఊయల సేవను నిర్వహించారు.
ప్రతి శుక్రవారం రోజు మరియు పౌర్ణమి, మూలానక్షత్రం రోజులలో ఈ ఊయలసేవ జరిపించబడుతోంది. ఈ సాయంత్రం ఈ ఊయలసేవ నిర్వహించబడుతుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పఠించారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిపించిన అనంతరం ఊయలలో వేంచేబు చేయించి శ్రీస్వామి అమ్మవార్లకు శాస్తోక్షంగా షోడశోపచార పూజ జరిపించారు.
ఆ తరువాత విశేషంగా అమ్మవారికి అష్టోత్తరం, త్రిశతి, ఖడ్గమాల, సహస్రనామపూజలు, స్వామివారికి సహస్రనామార్చన జరిపించబడుతాయి.చివరగా ఊయలసేవ నిర్వహించారు. ఊయల సేవను పురస్కరించుకుని శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషంగా పుష్పాలంకరణ, పుష్పార్చనలు జరిపించారు. పుష్పాలంకరణకు గాను పలుపుష్పాలు వినియోగించారు.

అంకాళమ్మ వారికి విశేష పూజలు
లోక కల్యాణం కోసం శ్రీశైల క్షేత్ర గ్రామ దేవత అయిన శ్రీ అంకాళమ్మ వారికి ఈ రోజు (01.07.2022) ఉదయం అభిషేకం, విశేష పూజలను నిర్వహించడం జరిగింది. ప్రతి శుక్రవారం రోజున శ్రీఅంకాళమ్మ వారికి దేవస్థానం సేవగా సర్కారిసేవగా) ఈ విశేషపూజ జరిపించబడుతోంది.
ఇందులో భాగంగా శ్రీ అంకాళమ్మ వారికి అభిషేకం, విశేష అర్చనలు, పుష్పాలంకరణ, కుంకుమార్చనలు జరిపించబడ్డాయి.
కాగా శ్రీశైల క్షేత్రానికి గ్రామదేవతగా చెప్పబడుతున్న అంకాళమ్మ ఆలయం, ప్రధాన ఆలయానికి ఎదురుగాగల రహదారికి చివరలో కుడివైపున ఉత్తరముఖంగా ఉంది.
ప్రకృతి శక్తుల యొక్క కళలే గ్రామ దేవతలని దేవీ భాగవతంలో చెప్పబడింది. ఈ ప్రకృతి అంతా ఆదిపరాశక్తి స్వరూపమేనని మన ఆర్షవాజ్ఞ్మయం చెబుతోంది. దైవశక్తి సమాజంలో ఏదో కొన్ని వర్గాలకు పరిమితం కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉందని తెలియజెప్పే మన విశిష్ట సంస్కృతి యొక్క ఉదాత్త వైఖరికి తార్కాణంగా ఈ గ్రామదేవత ఆరాధనను పేర్కొనవచ్చు.
చతుర్భుజాలను కలిగిన ఈ దేవి నాలుగు చేతులలో కుడివైపున క్రింది నుండి పైకి వరుసగా కత్తి, సర్పంలో చుట్టబడిన ఢమరుకం ఉండగా, ఎడమవైపున పానపాత్ర, త్రిశూలం ఉన్నాయి. కిరీట ముకుటం గల ఈ దేవి వస్త్రాలంకురాలై కర్ణాభరణాలను, కంఠాభరణాలను కలిగి ఉంటుంది.
కాగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతిపూజ జరిపించబడింది. ఆ తరువాత లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు.
అనంతరం పంచామృతాభిషేకం, హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, పుష్పోదకం, విశేష అభిషేకం అర్చన ను నిర్వహించబడ్డాయి.

సాంస్కృతిక కార్యక్రమాలు
దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా) ఈరోజు శ్రీ వాయిల గోపాలయ్య, వారి బృందం, నెల్లూరు వారిచే భజన కార్యక్రమం నిర్వహించబడింది.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ భజన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.
ఈ కార్యక్రమములో పలు భక్తి గీతాలు, అష్టకాలు మొదలైన వాటిని బి. రత్తమ్మ, సి.హెచ్. సుబ్బమ్మ పి. భాగ్యమ్మ, సి.హెచ్. కళావతి, ఎ. నరసమ్మ సి.హెచ్. లక్ష్మమ్మ, ఎ. పార్వతమ్మ, సి.హెచ్. ఆరణమ్మ, బి. రమాదేవి, కె. కామాక్షమ్మ తదితరులు భజన చేసారు. ఈ కార్యక్రమానికి డోలక్ సహకారాన్ని శ్రీ మాల్యాశ్రీ, కె. రాములు, హర్మోణీయం సహకారాన్ని శ్రీ పి. శ్రీనివాసాచారి అందించారు.
కాగా శ్రీ స్వామి అమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ ధర్మపథం కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.

రేపటి సాంస్కృతిక కార్యక్రమాలు
రేపు (02.07.2022) శ్రీ సాయి నటరాజ నాట్యలయం , సికింద్రాబాద్ వారిచే సంప్రదాయ నృత్యం కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.
బదిలీ అయిన ఉద్యోగులకు రిలీవ్ ఉత్తర్వులు
సాధారణ బదిలీలలో భాగంగా రాష్టదేవదాయశాఖ నిన్నటి రోజున (30.06.2022) ఈ దేవస్థానములోని వివిధ క్యాడర్స్ లో గల 45 మంది ఉద్యోగులను ఇతర దేవస్థానాలకు బదిలీ చేయడం జరిగింది.
ఈ దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, సహాయక కార్యనిర్వహణాధికారి, పర్యవేక్షకులు 10 మంది, అసిస్టెంట్ ఇంజనీర్లు ఇద్దరు (సివిల్ మరియు ఎలక్ట్రికల్), సీనియర్ అసిస్టెంట్లు 14 మంది, జూనియర్ అసిస్టెంట్లు 17 మంది బదిలీ అయినవారిలో ఉన్నారు.
ఈ దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వారిని శ్రీ వీరవెంకట సత్యనారాయణస్వామి దేవస్థానం, అన్నవరంకు బదిలీ కాగా తక్కిన ఉద్యోగులు శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం, శ్రీకాళహస్తి, శ్రీవరసిద్ది వినాయక దేవస్థానం, కాణిపాకం, శ్రీమహానందీశ్వరస్వామి దేవస్థానం, మహానంది, శ్రీనెట్టికట్టి ఆంజనేయ స్వామి, కసాపురమునకు బదిలీ అయ్యారు.
కాగా బదిలీ అయిన ఉద్యోగులందరినీ రిలీవ్ చేస్తూ ఈ రోజు (01.07.2022) కార్యనిర్వహణాధికారి వారు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన ఉద్యోగులు ఆయా దేవస్థానాలలో రిపోర్టు చేయవలసినదిగా ఈ రిలీవ్ ఉత్తర్వులలో పేర్కొన్నారు.