శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి, నందీశ్వరస్వామికి, బయలు వీరభద్రస్వామికి విశేష పూజలు
శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి విశేష అభిషేకం
శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: లోక కల్యాణం కోసం మంగళవారం మరియు షష్ఠిని పురస్కరించుకుని దేవస్థానం ఈ రోజు (05.07.2022) ఉదయం ఆలయప్రాంగణంలోని శ్రీసుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి)వారికి విశేషపూజలను నిర్వహించడం జరిగింది.
ప్రతి మంగళవారం మరియు కృత్తికా నక్షత్రం, షష్ఠి తిథి రోజులలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి ఈ విశేషఅభిషేకం మరియు పూజాదికాలు దేవస్థానంసేవగా (సర్కారిసేవగా) నిర్వహించబడుతున్నాయి.
కుమారస్వామివారికి పూజలు జరపడం వలన లోకకల్యాణమే కాకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగి ఆయా పనులు సక్రమంగా జరుగుతాయి. సుబ్రహ్మణ్యస్వామి
అనుగ్రహంతో శత్రుబాధలు, గ్రహపీడలు, దృష్టి దోషాలు మొదలైనవి తొలగిపోతాయి. అలాగే సంతానం కోసం పూజించేవారికి తప్పక సంతానభాగ్యం లభిస్తుందని చెప్పబడుతోంది.
ఈ అభిషేకానికి ముందుగా దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతివైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని, జనులకు ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాలమరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, జనులందరూ సుఖశాంతులతో ఉండాలంటూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు.
తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతి పూజ జరిపించబడింది. అనంతరం శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి అభిషేకము, అర్చన తరువాత సుబ్రహ్మణ్యస్తోత్రము పారాయణలు చేయబడ్డాయి.
సుబ్రహ్మణ్యస్వామి అభిషేకంలో స్వామివారికి పంచామృతాలైన పాలు, పెరుగు,తేనె,నెయ్యి, కొబ్బరినీళ్లు మరియు వివిధ పండ్ల రసాలైన దానిమ్మ, కమలా, ద్రాక్ష, అరటి మొదలైన వాటితో అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా వివిధ పళ్ల రసాలతో చేసే అభిషేకంతో ఎంతో ఫలితం ఉంటుందని ఆగమాలు చెబుతున్నాయి.
నందీశ్వరస్వామికి విశేషపూజ
లోక కల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు (05.07.2022) ఆలయ ప్రాంగణంలోని నందీశ్వర స్వామికి (శనగల బసవన్న స్వామివారికి) విశేషార్చనలను నిర్వహించారు.
ప్రతి మంగళవారం మరియు త్రయోదశి రోజున దేవస్థాన సేవగా (సర్కారీసేవగా) ఈ కైంకర్యం జరిపించబడుతోంది. ప్రదోషకాలంలో అనగా సాయంసంధ్యాసమయంలో ఈ విశేషపూజలు నిర్వహించడం జరుగుతోంది.
ఈ విశేషార్చనలో ముందుగా లోకక్షేమాన్ని కాంక్షిస్తూ దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరిత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని, జనులకు ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాలమరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, జనులందరూ సుఖశాంతులతో ఉండాలంటూ అర్చకస్వాములు, వేదపండితులు సంకల్పాన్ని చెప్పడం జరిగింది.
అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకుమహాగణపతిపూజను జరిపించబబడింది. ఆ తరువాత నందీశ్వరస్వామికి శాస్తోక్తంగా పంచామృతాలతోనూ, ద్రాక్ష, బత్తాయి, అరటి మొదలైన ఫలోదకాలతో హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రాక్షోదకం, బిల్వోదకం, పుష్పోదకం, సువర్ణోదకం మరియు మల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం నిర్వహిస్తారు. తరువాత నందీశ్వరస్వామికి అన్నాభిషేకం నిర్వహించారు.
పురుషసూక్తం, వృషభసూక్తం మొదలైన వేదమంత్రాలతో శాస్తోక్తంగా ఈ విశేషాభిషేకాన్ని చేయడం జరిగింది. తరువాత నందీశ్వరస్వామివారికి నూతన వస్త్ర సమర్పణ, విశేష పుష్పార్చనలను చేస్తారు. అనంతరం నానబెట్టిన శనగలను నందీశ్వరస్వామికి సమర్పించడం జరిగింది.
చివరగా స్వామికి నివేదన సమర్పించబడింది.
బయలు వీరభద్రస్వామికి ప్రదోషకాల అభిషేకం
లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు (05.07.2022) సాయంకాలం శ్రీశైలక్షేత్ర పాలకుడైన శ్రీబయలు వీరభద్రస్వామివారికి విశేషపూజలను జరిపించారు.
ప్రతీ మంగళవారం మరియు అమావాస్య రోజులలో బయలువీరభద్రస్వామివారికి ఈ విశేష అభిషేకం, అర్చనలను నిర్వహించబడుతున్నాయి.
బయలు వీరభద్రస్వామివారు శివభక్తగణాలకు అధిపతి. అదేవిధంగా శ్రీశైలక్షేత్రపాలకుడుగా క్షేత్రానికి ప్రారంభంలో ఆరుబయట ఉండి, ఎటువంటి ఆచ్చాదన, ఆలయం లేకుండగా బయలుగా దర్శనమిస్తాడు కనుక ఆయనకు బయలు వీరభద్రస్వామి అని పేరు వచ్చింది. ప్రసన్నవదనంతో కిరీట ముకుటాన్ని కలిగి దశభుజుడైన స్వామివారు పది చేతులలో వివిధ ఆయుధాలతో దర్శనమిస్తాడు. స్వామివారికి క్రిందివైపులో కుడివైపున దక్షుడు, ఎడమవైపున భద్రకాళి దర్శనమిస్తారు. ఈ స్వామిని దర్శించినంత మాత్రానే ఎంతటి క్లిష్ట సమస్యలైనా తొలగిపోతాయని, వ్యాధులు నశించి ఆయురారోగ్యాలు చేకూరుతాయని ప్రసిద్ధి.
ముఖ్యంగా ఆగమసంప్రదాయంలో క్షేత్రపాలక పూజకు చాలా విశేషస్థానం ఉంది. క్షేత్ర పాలకుడు పూజలు చేయడం వలన ఆ త్రంలో ఉన్నటువంటి భక్తులు ఎటువంటి భయబాధలు లేకుండా సుఖసంతోషాలతో ఉంటారు. మంగళవారం, ఆదివారం మరియు అమావాస్య రోజులలో చేసే వీరభద్రపూజ అనేక ఫలితాలు ఇస్తుందని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ స్వామిపూజతో సకలగ్రహ అరిష్టదోషాలు, దుష్టగ్రహపీడలు తొలగిపోతాయి. అదేవిధంగా సంతానం, ఐశ్వర్యం మొదలైన అనేక శుభఫలితాలు చేకూరుతాయి.
ఈ పూజాదికాలలో పంచామృతాలతోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది.
సాంస్కృతిక కార్యక్రమాలు
దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా) ఈరోజు మారెమ్మవ్వ భజనమండలి, యమ్మిగనూరు వారిచే భజన కార్యక్రమమం నిర్వహించారు.