|

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి విశేష అభిషేకం ; నందీశ్వరస్వామివారికి విశేషపూజ

శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి విశేష అభిషేకం

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: లోక కల్యాణం కోసం కృత్తికా నక్షత్రాన్ని పురస్కరించుకని దేవస్థానం ఈ రోజు (26.06.2022) ఉదయం ఆలయప్రాంగణంలోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి)వారికి విశేష పూజలను నిర్వహించడం జరిగింది.

ప్రతి మంగళవారం మరియు కృత్తికా నక్షత్రం, షష్ఠి తిథి రోజులలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి ఈ విశేష అభిషేకం మరియు పూజాదికాలు దేవస్థానం సేవగా (సర్కారిసేవగా) నిర్వహించబడుతున్నాయి.

కుమారస్వామివారికి పూజలు జరపడం వలన లోకకల్యాణమే కాకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగి ఆయా పనులు సక్రమంగా జరుగుతాయి. సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహంతో శత్రుబాధలు, గ్రహపీడలు, దృష్టి దోషాలు మొదలైనవి తొలగిపోతాయి. అలాగే సంతానం కోసం పూజించేవారికి తప్పక సంతానభాగ్యం లభిస్తుందని చెప్పబడుతోంది.

ఈ అభిషేకానికి ముందుగా దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతివైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని, జనులకు ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాలమరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, జనులందరూ సుఖశాంతులతో ఉండాలంటూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు.

తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజ జరిపించబడింది. అనంతరం శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి అభిషేకము, అర్చన తరువాత సుబ్రహ్మణ్యస్తోత్రము పారాయణలు చేయబడ్డాయి.

సుబ్రహ్మణ్యస్వామి అభిషేకంలో స్వామివారికి పంచామృతాలైన పాలు, పెరుగు,తేనె,నెయ్యి, కొబ్బరినీళ్లు మరియు వివిధ పండ్ల రసాలైన దానిమ్మ, కమలా, ద్రాక్ష, అరటి మొదలైన వాటితో అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా వివిధ పళ్ల రసాలతో చేసే అభిషేకంతో ఎంతో ఫలితం ఉంటుందని ఆగమాలు చెబుతున్నాయి.

నందీశ్వరస్వామివారి విశేషపూజ

త్రయోదశి సందర్భంగా ఈ రోజు (26.06.2022) నందీశ్వరస్వామివారికి పరోక్షసేవగా విశేషార్చన జరిపించబడుతోంది.

ప్రతి మంగళవారం రోజున మరియు త్రయోదశిరోజులలో దేవస్థాన సేవగా (సర్కారీసేవగా) ఈ కైంకర్యం జరిపించబడుతోంది.

అయితే ప్రతి నెలలో కూడా త్రయోదశి రోజులలో అనగా శుద్ధ త్రయోదశి మరియు బహుళ త్రయోదశి రోజులలో భక్తులు నందీశ్వరస్వామివారి పూజను పరోక్షసేవగా జరిపించుకునే అవకాశం కూడా కల్పించబడింది.

ఈ పూజాదికాలలో ముందుగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజను జరిపించబడుతుంది.

ఆ తరువాత నందీశ్వరస్వామికి శాస్తోక్తంగా పంచామృతాలతోనూ, పలు ఫలోదకాలతోనూ హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రాక్షాదకం, బిల్వోదకం, పుష్పోదకం, సువర్ణోదకం మరియు మల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం నిర్వహించబడుతుంది. తరువాత నందీశ్వరస్వామికి అన్నాభిషేకం నిర్వహించబడుతుంది.

పురుష సూక్తం, వృషభసూక్తం మొదలైన వేదమంత్రాలతో శాస్తోక్తంగా ఈ విశేషాభిషేకాన్ని చేయడం జరుగుతుంది. తరువాత నందీశ్వరస్వామివారికి నూతనవస్త్ర సమర్పణ, విశేషపుష్పార్చనలు జరిపించబడుతాయి. తరువాత నానబెట్టిన శనగలను నందీశ్వరస్వామికి సమర్పించడం జరుగుతుంది. చివరగా స్వామికి నివేదన సమర్పించబడుతుంది.

కాగా త్రయోదశి రోజున జరిపించబడే నందీశ్వరస్వామివారి పరోక్షసేవకు భక్తులు ఆన్లైన్ ద్వారా రూ.1,116/-లను సేవారుసుముగా చెల్లించాల్సి ఉంటుంది.

భక్తులు సేవారుసుమును www.srisailadevasthanam.org లేదా aptemples.ap.gov.in ద్వారా చెల్లింపు చేయవచ్చు.

నందీశ్వరస్వామివారి ఆరాధన వలన సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని, సమస్యలు తొలగి సుఖసంతోషాలు కలుగుతాయని, ఋణబాధలు తీరుతాయని, అనారోగ్యం తొలగి ఆరోగ్యం చేకూరుతుందని, కష్టాలు నివారించబడతాయని, మానసిక ప్రశాంతత చేకూరుతుందని పండితులు పేర్కొంటున్నారు.

అదేవిధంగా ఈ స్వామికి నానబెట్టిన శనగలను సమర్పించడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పబడుతోంది. అందుకే ఈ స్వామివారికి శనగలబసవన్న అనే పేరు కూడా ప్రసిద్ధంగా ఉంది.

ఈ పరోక్షసేవ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించేందుకు వీలుగా ప్రసార వివరాలు, ప్రసారాల సమయం మొదలైనవాటిని ఎప్పటికప్పుడు సేవాకర్తలకు తెలియజేయడం జరుగుతున్నది.

సేవాకర్తలేకాకుండా భక్తులందరు కూడా వీటిని శ్రీశైలటి.వి / యూ ట్యూబ్ ద్వారా వీక్షించవచ్చును. కావున భక్తులందరు కూడా ఈ పరోక్షసేవను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము.

ఇతర వివరములకు దేవస్థానం సమాచార కేంద్ర ఫోన్ నంబర్లు 83339 01351/ 52 / 53/54/ 55/56 లను సంప్రదించవచ్చును.

పల్లకీ ఉత్సవం

లోకకల్యాణం కోసం మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఈ రోజు (26.06.2022) రాత్రి శ్రీ స్వామి అమ్మవార్లకు పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించారు.

ఈ పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి మరియు మూలా నక్షత్రం రోజులలో (సర్కారి సేవగా) జరిపించబడుతోంది.

ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పఠించారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరిపించారు. అనంతరం శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో వేంచేబు చేయించి శాస్తోక్షంగా షోడశోపచారపూజలు జరిపించబడ్డాయి.

ధర్మపథంలో నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా సంప్రదాయ నృత్య కార్యక్రమం

దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా) ఈ రోజు (26.06.2022) శ్రీవేదగాయత్రి నృత్యకళాక్షేత్రం, విశాఖపట్నం వారిచే ఈ సంప్రదాయ నృత్య కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.

ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య, కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.

ఈ కార్యక్రమములో వినాయకకౌత్వం, సాంబసదాశివ, శివపంచాక్షరి, దేవిస్తుతి, శివాష్టకం, , శంభో శిహోహం, తదితర అంశాలకు సౌగంధిక, జాహ్నవి, శ్రావని, హారిక, మోక్షిత,లిక్షితసాయి, వైష్ణవి. క్రితిక, ఆర్పిత, సిరివర్షిణి, సహస్ర, భవ్యశ్రీ, పల్లవి, గీతిక, నిహారిక, మేఘన, దీషణ, మనోఘణ్య, గాయత్రి తదితరులు నృత్య ప్రదర్శన చేసారు.

కాగా శ్రీ స్వామి అమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ ధర్మపథం కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.

రేపటి సాంస్కృతిక కార్యక్రమాలు
రేపు (27.06.2022) శ్రీమతి ఝాన్సీరామ్ మరియు వారి బృందం వారిచే సంప్రదాయ నృత్యం కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.

లడ్డు ప్రసాద తయారీ కేంద్రాన్ని పరిశీలన

ఈ రోజు  కార్యనిర్వహణాధికారి మరియు ట్రస్ట్ బోర్డు సభ్యలు శ్రీ మేరాజోత్ హనుమంతనాయక్, శ్రీమతి బి.పద్మజ తదితరులు లడ్డు మరియు పులిహోర ప్రసాద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లడ్డు మరియు పులిహోర ప్రసాదాల తయారీలో విధిగా శుచిశుభ్రతలను పాటిస్తుండాలని సంబంధికులను ఆదేశించారు. ప్రసాదాలలో ఏ మాత్రం నాణ్యత తగ్గకుండా వుండేవిధంగా తయారీ ఉండాలన్నారు.

అనంతరం రోజువారి ప్రసాదాల తయారీ, ఎప్పటికప్పుడు విక్రయకేంద్రాలకు పంపబడుతున్న స్టాకు నమోదు, ఇండెంట్ల నమోదు మొదలైనవాటిని పరిశీలించారు.

అలాగే భక్తులు కోరినన్ని లడ్డుప్రసాదాలు ఇచ్చేందుకు ఎప్పటికప్పుడు అవసరమైన మేరకు లడ్డు ప్రసాదాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు.

శని, ఆది, సోమవారాలు, పర్వదినాలు, ప్రభుత్వపు సెలవురోజులలో భక్తులరద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు.

భక్తులరద్దీకనుగుణంగా అవసరమైన మేరకు ప్రసాదాల తయారీ ఉండాలన్నారు.

ప్రసాదాల విక్రయ కేంద్రాల క్యూలైన్లలో భక్తులు అధిక సమయం వేచి ఉండకుండా త్వరితగతిగా ప్రసాదాలను అందజేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు.

 

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *