తెలంగాణ సాహిత్య అకాడమి (తేది: 22.11.2022): అన్ని రకాల పోటీ పరీక్షలకు, తెలుగు సాహిత్యం అధ్యయనానికి కరదీపిక “తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్ర” – మంత్రి శ్రీనివాస్ గౌడ్
అన్ని రకాల పోటీ పరీక్షలకు, తెలుగు సాహిత్యం అధ్యయనానికి కరదీపిక “తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్ర” – మంత్రి శ్రీనివాస్ గౌడ్
విద్యార్థులకు, విద్యార్థి లోకానికి, అధ్యాపక, ఉపాధ్యాయ లోకానికి మొత్తం సాహిత్య లోకానికి కరదీపిక “తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్ర” అని తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖామాత్యులు వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇప్పటివరకు తెలంగాణ ప్రజలు ఎదురుచూసిన సమగ్ర సాహిత్య చరిత్ర 715 పేజీలతో ఈ మహాగ్రంధంలో నిక్షిప్తమైందని ఆయన సగర్వంగా ప్రకటించారు. అన్ని రకాల పోటీ పరీక్షలకు, తెలుగు సాహిత్యం అధ్యయనానికి “తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్ర” ఒక దారిదీపంలా దారి చూపుతుందన్నారు. మంగళవారం మంత్రి కార్యాలయంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు శంకర్ తో కలిసి “తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్ర” గ్రంథాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గ్రంథంలో 50 మంది రచయితలు పూర్వయుగం తొలిపాలకులు, వేములవాడ చాళుక్యులు నుండి మొదలుకొని మలిదశ తెలంగాణ ఉద్యమ సాహిత్యం వరకు ఈ గ్రంథంలో నిక్షిప్తం చేశారని పేర్కొన్నారు. అచ్చమైన తెలుగు నుడికారానికీ, అచ్చతెనుగు కావ్య సృజనకూ చిరునామా వంటి తెలంగాణం పరిపూర్ణమైన తెలుగు మాగాణమని చెప్పారు. అనుకూల, ప్రతికూల పరిస్థితుల్లోనూ తెలంగాణలో తెలుగు ‘స్థిత ప్రజ్ఞత్వాన్ని’ చాటుకున్నదని, గోనబుద్దారెడ్డి, పాల్కురికి సోమనాథుడు, పోతన, భాస్కర రామాయణ కవులు, మారన, గౌరన, గోపరాజు ఇంకా ఆనాటి సంప్రదాయ కవిత్వ పంక్తిలో తెలంగాణది సింహభాగమన్నది కాదనలేని చారిత్రక వాస్తవమన్నారు. రాష్ట్ర అవతరణ తర్వాత 1 నుంచి 10 తరగతుల వరకు పాఠ్య పుస్తకాల సిలబస్ లలో తెలంగాణ అస్తిత్వం చోటు చేసుకుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
తెలంగాణ సాహిత్య అకాడమి ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ తెలంగాణ సాహిత్యానికి సాహిత్య చరిత్రలో తీవ్రమైన అన్యాయం జరిగిన సంగతి మాత్రం నికార్సయిన నిజమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత సాహిత్య చరిత్రలో జరిగిన అన్యాయాల తొలగింపుకు సీఎం కేసీఆర్ దార్శనిక ఆలోచనలతో ముమ్మర యత్నాలు ప్రారంభించారని తెలిపారు. అందులో భాగమే తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురిస్తున్న ప్రస్తుత బృహత్ గ్రంథం – “తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్ర” యని జూలూరు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి మామిడి హరికృష్ణ, గ్రూప్-1 అధికారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మామిళ్ల చంద్రశేఖర్ గౌడ్, కాళోజీ పురస్కార అవార్డు గ్రహీత కోట్ల వెంకటేశ్వరరెడ్డి, ప్రముఖ సాహిత్య విమర్శకులు కెపి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.