తెలంగాణ సాహిత్య అకాడమి (13-12-22): ఈతరం చరిత్రను లోతుగా అధ్యయనం చేయాలి – జూలూరు గౌరీశంకర్
ఈతరం చరిత్రను లోతుగా అధ్యయనం చేయాలి – జూలూరు గౌరీశంకర్
తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్రను లోతుగా అధ్యయనం చేస్తేనే తెలంగాణ సమాజ పరిణామక్రమం పరిపూర్తిగా అవగతమవుతుందని తెలంగాణ సాహిత్య అకాడమి ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. పోటీ పరీక్షల్లో రాణించాలనుకున్న విద్యార్థులు 33 జిల్లాల సమగ్ర చరిత్రలను చదవాలని చెప్పారు. మంగళవారం సాహిత్య అకాడమి కార్యలయంలో “తెలంగాణ బిట్ బ్యాంక్” పుస్తకాన్ని ప్రముఖ సాహితీవేత్త నలిమెల భాస్కర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జూలూరు మాట్లాడుతూ ఉద్యోగార్ధులుగా రావాల్సిన వాళ్లకు జిల్లాలకు సంబంధించిన సమగ్ర విషయాలు తెలిసి వుండాలని పేర్కొన్నారు. ఏ జిల్లాలో ఏ రకమైన విశేషాలున్నాయో, ఈ నేలకోసం జరిగిన త్యాగాలు వీరుల చరిత్రలు, సహజ సంపదలు, సాహిత్య, సామాజిక, సాంస్కృతిక రంగాలకు సంబంధించిన విషయాలన్నీంటి పై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత జరిగిన వేగవంతమైన మార్పులు, పరిణామాలు, కాళేశ్వర ప్రాజెక్టు నుంచి కోటి ఎకరాల మాగాణం వరకు తెలిసుండాలన్నారు. యాదాద్రి దేవస్థానం నుంచి మెదక్ చర్చి వరకు, జోగులాంబ దేవాలయం నుంచి జోడేగాట్ వరకు ఖమ్మం మెట్టు నుంచి కొండమల్లన్న జాతర, కోటిలింగాల వరకు, అన్ని విషయాలు ఈతరం తెలుసుకోవాలని జూలూరు గౌరీశంకర్ తెలిపారు.
ప్రముఖ భాషావేత్త నలిమెల భాస్కర్ మాట్లాడుతూ, తెలంగాణలో చరిత్ర నిర్మాణం వేగవంతంగా జరగవల్సి ఉందన్నారు. ఇప్పుడు తెలంగాణ పునర్నిర్మాణ కాలంలో ఉన్నామని ఎంతో పరిశ్రమించి, పరిశోధించి మన చారిత్రక సాంస్కృతిక వైభవాన్ని పదిల పరచాలన్నారు. గ్రూప్ పరీక్షలకు సంబంధించి తగిన సమాచారం కోసం విరివిగా పుస్తకాలు వెలువడాల్సిన అవసరం ఉందన్నారు. చరిత్ర ఎంత సమగ్రంగా రూపొందితే అది విద్యార్థులకు ఎంతగానో ఉపకరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి నమోజు బాలాచారి, తెలంగాణ బిట్ బ్యాంక్ పుస్తక సంపాదకులు తంగిరాలచక్రవర్తి, కోయచంద్రమోహన్, ప్రముఖ కవి కోట్ల వెంకటేశ్వరరెడ్డి, సాహితీ విమర్శకులు కె.పి. అశోక్ కుమార్, జర్నలిస్టు సాధిక్ తదితరులు పాల్గొన్నారు.