తెలంగాణ సాహిత్య అకాడమి: పోలీస్ స్టేషన్లకు “పునాస” పత్రిక
పోలీస్ స్టేషన్లకు “పునాస” పత్రిక
తెలంగాణ సాహిత్య అకాడమి నెలనెలా వెలువరిస్తున్న “పునాస” సాహిత్య పత్రికను రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించేందుకు తెలంగాణ రాష్ట్ర డిజిపి డాక్టర్ ఎమ్. మహేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. సోమవారం నాడు సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరు గౌరీశంకర్ డిజిపి కార్యాలయంలో మహేందర్ రెడ్డితో భేటీ అయ్యారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత సాహిత్య సాంస్కృతిక రంగాలలో వచ్చిన మార్పులు, పాఠశాల విద్యలో ప్రధానంగా తెలుగు పాఠ్యాంశాలలో వచ్చిన మార్పులపై ఆయన చర్చించారు. విస్తృత సాహిత్యకారుల గురించి పాఠ్యాంశాలలో చేర్చటం ద్వారా ఈ తరం విద్యార్ధులకు తెలంగాణ అస్తిత్వం అర్ధమవుతుందని డిజిపి పేర్కొన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమి వెలువరిస్తున్న సాహిత్య పత్రిక “పునాస”ను రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించేందుకు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా సాహిత్య అకాడమి అద్యకులు జూలూరు గౌరీశంకర్ డిజిపిని కోరారు.
తెలంగాణ సాహిత్య సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీకగా “పునాస” పత్రిక వెలువడుతుందని తెలిపారు. “పునాస” ను ప్రతి పోలీస్ స్టేషన్‌కు పంపేందుకు డిజిపి అంగీకరించారు.